కేతు గ్రస్త సూర్య గ్రహణం వివరాలు : 26th Dec 2019

షష్ట గ్రహ కూటమిలో మార్గశిర మాసంలో సంభవించే కేతు గ్రస్త గ్రహణ విషయాలు

ప్రధమంగా, గ్రహణ సమయాలన్నీ పుణ్య ఘడియలు అని తెలుసుకుని యధా శక్తిగా సాధన చేసుకోవడం శ్రేష్టం. గ్రహణ సమయాలలో గుడులను మూసివేయడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటంటే, బాహ్యంగా దర్శించుకుంటున్న, ప్రాణ ప్రతిష్ట చేయబడ్డ మూర్తిని, కాసేపు వెసులు బాటు ఇచ్చి, అంతర్ముఖులై లోపలే ఉన్న ఈశ్వరుని దర్శించుకుని తరించమని చెప్పడమే.

భారత దేశంలోని కొన్ని ప్రాంతాలలో మినహా, మిగిలిన అన్ని ప్రాంతాలలో ఈ గ్రహణం పాక్షికమే. కర్ణాటకలోని గోకర్ణంకు వాయువ్యంలోని అంకోలా పట్టణంలో  గ్రహణ ఛాయ 8:04 నిమిషాలకు ప్రారంభమై 11:02 ముగుస్తుంది.  ఉడుపి మంగళూరులకు మధ్యలోని ముక్కు అనే చోట, ఉదయం 8:05నకు పూర్ణగ్రహణం ప్రారంభమై, 11:05 నిమిషాలకు పూర్తౌతుంది.  తూర్పున ఉన్న రామేశ్వరంలో గ్రహణ ఛాయ 8:08 నకు ప్రారంభమై పూర్ణగ్రహణం 9:33 నిమిషాలకు ఆరంభమౌతుంది. దాదాపుగా మూడు గంటల పదకొండు నిమిషాల నిడివి కలిగి 11:20నకు భారతావనిని దాటి వెడుతుంది.

శ్రీ వత్సస గోత్రీకుడనై, చక్రవర్తి అని పిలవబడు, నేను ప్రస్తుతం భాగ్యనగరంలో ఉన్నందున, ఈ ప్రదేశానికి పాక్షికమే అయినందున, ఇక్కడి ఛాయ సమయాలు ఇస్తున్నాను. ఉదయం 8:08 నిమిషాలకు ప్రారంభమై, అధికంగా 9:31 నిమిషాలకు కనబడి, 11:11 నిమిషాలకు పూర్తౌతుంది. ఈ సమయాలు అన్నీ భారత కాల మాన ప్రకారం ఇచ్చినందున, భాగ్యనగర అక్షాంశ రేఖాంశాలను ఆధారంగా సమయ్యాన్ని, దాదాపుగా 6 నిమిషాల ముందుకు సవరించుకోవలసి ఉంది. అంటే,  ఉదయం 8:14 నిమిషాలకు ప్రారంభమై, అధికంగా 9:37 నిమిషాలకు కనబడి, 11:17 నిమిషాలకు పూర్తౌతుంది.

స్థలం : భాగ్యనగరం
ప్రారంభం : 8:14 am
అధికం : 9:37 am
విడుపు : 11:17 am

సౌదీ అరేబియాలోని రియాద్ నకు ఆగ్నేయంగా దాదాపు 250 కిలో మీటర్ల దూరంలోని అష్ షాముల్ అనే ప్రదేశంలో ప్రారంభమైయ్యే గ్రహణ ఛాయ ఉదయం 6:25 ప్రారంభమై, పూర్ణంగా 6:36 నుంచి ఒక్క నిమిషముండి, విడుపు ప్రారంభమై ఛాయా విడుపు 7:48 ప్రారంభమౌతుంది. దాదాపుగా 2 గంటల 16 నిమిషాల నిడివి ఉండి 8:41 నిమిషాలకు అంతమౌతుంది. భూమిమీద గ్రహణ ఛాయ ఆరోజు సాయంత్రం 6:03 నిమిషాల వరకూ ఉంటుంది. కావున ఆ పన్నెండు గంటలూ శుభ సమయాలే కావున. యధా శక్తి జప తప దాన దర్మాలు ప్రయత్న పూర్వకంగా చేయడం శ్రేష్టం

సమయ వివరాలు ముగిస్తూ, గ్రహణ ఫలితాల గురించి పరిశీలిస్తే,  మూలా నక్షిత్రంలో జన్మించిన వారికి ఇది పరిక్షా సమయం. వారికి మానశిక మఱియు శారీరిక ఇబ్బందులు కలగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ గ్రహణం అంత శుభ ప్రధమైనది కాదు. కావున ఎవ్వరూ దీనిని పరీక్షించే ఉద్దేశ్యంతోనైనా, మరే ఉద్దేశ్యంతోనైనా గమనించకుండా ఉంటే శ్రేయస్కరం. సంధ్యావందన అధికారం ఉన్న ప్రతీ ఒక్కరూ, గ్రహణానికి పూర్వమే సంధ్యావందనం ముగించుకుని, గ్రహణ ప్రారంభానికి పూర్వం ధరించిన బట్టలతోనే స్నానం చేసి దీక్షా వస్త్రాలు ధరించాలి. జప తపాలు చేస్తూ, గ్రహణ అధిక సమయంలో పితృ తర్పణాలు ఇవ్వాలి. తరువాత యధా శక్తిగా గ్రహణ విముక్తి వరకూ మంత్ర సాధన మరియు పూజలు చేసుకోవాలి. గ్రహణం విడిచిన తరువాత, దీక్షా బట్టలతోనే స్నానం చేసి ఇష్టదైవాన్ని తలచి సూర్యునకు అర్ఘ్యం ఇవ్వాలి. ఆ పిదప భోజన కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవాలి.

ఈ గ్రహణం ద్వాదశ రాశుల వారిపై ఏవిధంగా ప్రబావం చూపుతుందో ఒక్క సారి పరిశీలిద్దాం.

౧.మేషము
సత్యం బ్రుయాత్, ప్రియం బ్రుయాత్, బ్రుయాత్ సత్య మ ప్రియం!ప్రియం చ నా వృతం బ్రుయాత్ ఏషధర్మ స్సనాతప:!!

తా: సత్యమునే పలుకవలెను.  ఆ సత్యము వినువానికి ప్రియముగా ఉండవలెను. అప్రియమైన సత్యమునుగాని, ప్రియంగా వున్న అసత్యమునుగాని పలుక రాదు. ఇది సనాతనమైన, అనగా ఎప్పుడూ మార్పు చెందని ధర్మము అని మనుస్మృతి చెప్పుచున్నది.

ఈ రాశి వారు ఈ సమయంలో వాక్కుని ఎంత ఎక్కువ మితంగా వాడితే అంత మంచిది. అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. వాటిని వీరి ఎదుగుదలకు పనికి వచ్చే విధంగా వాడుకోవడానికి బుద్ది ఇవ్వమని గురువులను లేదా ఇష్ట దైవాల పాదాలను పట్టుకుని ఉంటే మంచిది. ఇవే ఆలోచనలు నష్టాన్ని కూడా తీసుకు వస్తాయి, కావున ఎరుక కలిగి ఉండటం శ్రేయస్కరం


౨.వృషభము 
గ్రహణాన్ని చూడకపోవటమే శ్రేష్టం. ఆరోగ్యం భాస్కరాదిత్యేచ్ అని వేదం చెప్పడం వల్ల వీరు కెంపు ధరించి ద్వాదశాదిత్యుల స్తుతి చేస్తే శుభం కలుగుతుంది. వీరికి వెన్నుపోటు పొడిచే వారికి ఇది సరైన సమయం. కావున వారికి ఆ అవకాశాలు, ఈ సమయంలో ఇవ్వకుండా ఉంటె మంచిది.

తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదమ్|
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||

అనే మంత్రాన్ని యధా శక్తి పఠించడం శుభం

౩.మిధునము

నిర్ణయ ప్రధానమైన ఆలోచనలు ముట్టడి చేస్తాయి.

నమస్తుబ్యం విరూపాక్ష నమస్తే తిగ్మచెక్షుశే|
నమః పినాక హస్తాయ దన్విని కామరూపిణి||

ఈ కొద్ది గంటలైనా నిర్మొహమాటంగా, నిర్భయంగా ఉండటం భవిష్యత్తునకు మంచిది.

౪.కర్కాటకము

 'బుద్ధి కర్మాను సారిణి' అన్నట్లుగా వీరికి బుద్ది ప్రచోదనం అవుతుంది. సరైన పెట్టుబడులు చేయడానికి ఇది సరైన సమయం.  స్వర సహితంగా శ్రీ సూక్తం వచ్చిన వారు తప్పని సరిగా పఠించవలసింది. లేని వారు,

మనసః కా మమాకూతిం వాచః సత్యమ శీమహి |
పశూనాం రూపమన్య స్య మయి శ్రీః శ్రయతాం యశః ||

అని యధా శక్తి ప్రార్దించాలి.  అవకాశం చేసుకుని రాహుకు అలాగే శనికి పనికి వచ్చే దాన దర్మాలు చేసుకోవడం మంచిది

౫.సింహము

మానశిక ఆందోళన కలిగే సమయాలు ఇవి. వృత్తి పరమైన అభివృద్ది ప్రలోభాలు కలుగుతాయి. గురు గ్రహం అనుకూలంగా ఉండటం వల్ల, గురువుని ఆశ్రయించడం మంచిది. కాకపోతె నిషిద్ద గురువు విషయంలో జాగ్రత్త వహించాలి.

ఓంసహనావవతు సహనౌ భునక్తు, సహ వీర్యం కరవా వహై |
తేజస్వినావధీతమస్తు, మా విద్విషా వహై ||
 ఓం శాంతిః శాంతిః శాంతిః

గురుశిష్యులు ఇద్దరూ కలసి చదువుకోవలసిన మంత్రం. కావున వీలు చేసుకుని గురువుల వద్దకు వెళ్లి పఠించండి.

౬.కన్య

గ్రహణాన్ని చూడకపోవటమే శ్రేష్టం. వీరికి ఖర్చుకు సంబందించిన ఒత్తిడులు ఈ సమయంలో కనబడతాయి. కావున ఆలోచనలను ఆలశ్యం చేయడం మంచిది. అలాగే వ్యాధి కారకాలు ప్రచోదనం అవుతాయి. వాటినుంచి కాపాడుకోవడానికి విష్ణుమూర్తిని ఈ క్రింది మంత్రంతో యధా శక్తతో సాధన చేయ్యాలి

శరీరే జర్ఘరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరేఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిః

౭.తుల

కోపం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున ఇంట్లోంచి బయటకు ఏదైనా పని విషయమై వెళ్లేటప్పుడు ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తూ వెళ్లాలి.

అగ్రతో నారసిమ్హశ్చ పృష్థతో బలకేశవౌ |
ఉభయోః పార్శ్వయోరాస్తాం సశరౌ రామలక్ష్మణౌ ||

భార్యా భర్తలకు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన సమయం. కాబట్టి, అర్దాంగి, భార్య అయినా భర్త అయినా, సలహాలు అడిగి తీసుకోవడానికి అనుకూలంగా ఉండే సమయం

౮.వృశ్చికము

అప్పులు తీసుకోవడానికి ప్రలోభం జరిగే సమయం ఇది. కావున అలాంటి ఆలోచనలను బుద్ది పూర్వకంగా తృంచి వేసి, వాటిల్ని భవిష్యత్తులో కూడా పాటించ కుండా ఉండాలి. అలాగే యధా శక్తిగా ఈ క్రింది మంత్రం జపిస్తూ భస్మ ధారణ చేయ్యాలి

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం|
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||

౯.ధనుస్సు

గ్రహణాన్ని చూడకపోవటమే శ్రేష్టం. గ్రహణానికి పూర్వం మఱియు తరువాత సూర్యునకు ఈ క్రింది మంత్రాలతో అర్ఘ్యం ఇవ్వాలి.

బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నంతు మహేశ్వరం |
సాయంధ్యాయే సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరం ||

వినతా తనయో దేవః కర్మ సాక్షి సురేశ్వరః
సప్తాశ్వః సప్తరజ్ఞాశ్య అరణోమమ ప్రసీదతు|

ఆదిత్యస్య నమస్కారం యేకుర్వంతి దినే దినే
జనాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే|

అహం అనే తత్వం మూలాలలో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తుంది. కావున ప్రయత్న పూర్వకంగా ఈ ఆలోచనలను ఆదిలోనే తృంచేయ్యాలి.

౧౦.మకరము
గ్రహణాన్ని చూడకపోవటమే శ్రేష్టం. హితులు కలిసి వచ్చే సమయాలు కనబడతాయి. అందులో వెన్నుపోటు వారు కూడా ఉండవచ్చు. కావున అన్ని రూపాలలోనూ అమ్మవారే ఉన్నారని తలస్తూ ఈ క్రింది మంత్రాన్ని యధాశక్తిగా జపించాలి

సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే|
భయేభ్య స్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే||

విధ్యార్దులు ప్రయత్న పూర్వకంగా క్రొత్త ప్రయోగాలకు నాంది పలకడాని శుభ సమయం

౧౧.కుంభము
గురు శనులు అనుకూలంగా ఉంటారు. ఏవైనా పెట్టుబడులకు సంబందించిన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన సమయం. నవ గ్రహాలకు సంబందించిన ఈ క్రింది మంత్రాన్ని యధాశక్తిగా జపిస్తూ గ్రహణ విడుపు గమనించండి. గ్రహణాన్ని చూడ వద్దు కానీ అనుభవించండి.

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ|
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః||

౧౨.మీనము

రాహువు కారణంగా విశ్రాంతి లేని సమయాన్ని గడుపుతారు. అవమానం కలగడానికి నాంది పలికే కార్యాలు మీకు తెలియకుండా జరుగుతాయి. ఉపకారం చేసిన వారే అపకారం చేయడానికి ప్రయత్నాలు చేయడానికి ఆరంభం అవుతుంది. కావున ఎవ్వరితో కలవకుండా ఉంటె బాగుంటుంది. మీరు సాధనలో అధికులవ్వలని ఈ క్రింది శ్లోకాన్ని రేపటి నుంచి ఆరంభించి, సహస్ర తిధులు (అంటే దాదాపు మూడు సంవత్సరాల పాటు) నిర్విఘ్నంగా పఠిస్తే శుభం జరుగుతుంది.

జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం|
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ||

ప్రదోష వేళలో వీటిని మీతో పంచుకోవడం ఈశ్వరానుగ్రహంగా తలుస్తూ, సర్వం శ్రీ ఉమామహేశ్వారర్పణమస్తు.